: రామ్ గోపాల్ వర్మ నాపై చేసిన కామెంట్లను పట్టించుకోను: ఎమ్మెల్యే, నటి అంగూర్ లత
అసోంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడి విజయం సాధించిన నటి అంగూర్ లతపై ఇటీవల దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిలో ఇక 'అచ్చే దిన్' వచ్చినట్టేనని, తనకు తొలిసారిగా రాజకీయాలపై ప్రేమ పుట్టిందని వర్మ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వర్మ అంగూర్ లత ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. అయితే ఎమ్మెల్యే అంగూర్ లత ఈ విషయమై తాజాగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లను పట్టించుకునే అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ‘నేను రామ్ గోపాల్ వర్మ గురించి పట్టించుకోను. వర్మ తనకు ఇష్టమొచ్చిన కామెంట్లు చేసుకోవచ్చు. అతను ఏం ఆలోచిస్తాడో, ఏం మాట్లాడతాడో నేను పట్టించుకోను. అస్సాం ప్రజలకు నేనేంటో తెలుసు. వర్మ తన ఆలోచనలను పంచుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకోవడం మంచిదే’ అని అంగూర్ లత అన్నారు. కాగా, తన కామెంట్లను పాజిటివ్ దృక్పథంతోనే చేశానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. తన కామెంట్లు కేవలం కాంప్లిమెంట్లు మాత్రమేనని ఆయన తెలిపాడు. తన కామెంట్లలో తప్పేమీలేదని పేర్కొన్నాడు.