: సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే బూట్లు తుడవమన్నారు!


తన సెల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన, ఫిర్యాదు దారుడిని అక్కడి పోలీసు అధికారి బూట్లు తుడవమన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చార్తావేల్ ప్రాంతానికి చెందిన సిత్తు బూట్ పాలిష్ చేసి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన సెల్ ఫోన్ పోయింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకని అక్కడి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. చిన్న చిన్న ఫిర్యాదులను స్వీకరించమని పోలీసులు చెప్పారు. అయితే, తనకు మరో కొత్త ఫోన్ కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదని, తన ఫిర్యాదు స్వీకరించాలని బతిమలాడాడు. అయినప్పటికీ, వారు పట్టించుకోలేదు. అయితే, సిత్తు బూట్ పాలిష్ చేసే వ్యక్తి అని తెలిసిన ఒక పోలీసు అధికారి తన బూట్లు పాలిష్ చేయాలని, అప్పుడే ఫిర్యాదు స్వీకరిస్తానని అన్నాడు. దీంతో, సిత్తు తన ఇంటికి వెళ్లి పాలిష్ చేసే వస్తువులను తీసుకు వచ్చాడు. ఆ అధికారి బూట్లు పాలిష్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయమని సిత్తుకు చెప్పడంతో ఆయన ఆవిధంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తితో అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News