: ప్రతీ విషయాన్ని కొత్తగా చూడాలి: ఢిల్లీలో విద్యార్థులకు సూచించిన సత్య నాదెళ్ల
‘మీరు చూసే దృష్టిని మార్చుకొని ప్రపంచాన్ని చూస్తే.. ప్రపంచంలో మీరు చూడాలనుకుంటోన్న మార్పుని చూస్తారు’ అని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల అన్నారు. భారత్ పర్యటన సందర్భంగా ఈరోజు ఢిల్లీ చేరుకున్న ఆయన తమ సంస్థ నిర్వహిస్తోన్న ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్ని కొత్తగా చూడటం నేర్చుకోవాలని విద్యార్థులు, యువపారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ ఆవశ్యకతను ఆయన వివరించారు. మొబైల్ యాప్‌లలో చాలా మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. 2014 ఫిబ్రవరీలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత సత్య నాదెళ్ల మూడోసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నారు. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో టెలికాం మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్‌తో డిజిటల్ ఇండియా, మైక్రోసాఫ్ట్‌తో భారత ప్రభుత్వం సమన్వయం అంశాలపై చర్చించారు.