: హైదరాబాద్ సహా పలు నగరాల్లో డీజిల్ వాహనాల నిషేధం?
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ డీజిల్ వాహనాలను నిషేధించే విషయమై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) నేడు నిర్ణయం తీసుకోనుంది. వీటిలో హైదరాబాద్ సహా ముంబై, కోల్ కతా, కాన్పూర్, బెంగళూరు, చెన్నై, పాట్నా, అలహాబాద్, వారణాసి, నాగపూర్, లక్నో, పుణె, లూథియానా, అమృతసర్, జలంధర్ తదితర నగరాలు ఉన్నాయి. కాగా, గత సంవత్సరం డిసెంబరులో న్యూఢిల్లీలో రెండు లీటర్ల కన్నా అధిక సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ ను కలిగివున్న వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆపై కేరళ కూడా అదే దారిలో పయనించింది. దేశీయ వాహన పరిశ్రమ కుదేలవుతుందని, 40 వేల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోతారని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) హెచ్చరించినప్పటికీ, భవిష్యత్ వాయు నాణ్యత దృష్ట్యా ఎన్జీటీ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఇక నేడు వెల్లడయ్యే నిర్ణయం కోసం వాహన పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.