: కాపు భవనాలకు ‘చంద్రన్న’ పేరు ముఖ్యమంత్రి ఆలోచనే: ముద్రగడ ఆగ్రహం
కాపు భవనాలకు ‘చంద్రన్న’ పేరు పెట్టనుండడంపై ఎదురవుతోన్న వివాదంపై కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మరోసారి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రన్న పేరు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేయలేదంటూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘కాపు భవనాలకు చంద్రన్న పేరు ముఖ్యమంత్రి ఆలోచనే’ అని ముద్రగడ ఆరోపించారు. ఆగస్టులోగా కాపు రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ముద్రగడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులు తమ బతుకుదెరువు కోసం చంద్రబాబుకు భజన చేస్తున్నారని ఆయన అన్నారు. కాపు జాతికి ఛాంపియన్ కావాలనుకునే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ‘మాటి మాటికీ జగన్ జగన్ అంటున్నారు. నేను జగన్‌ని ఒక్కడినే కలవలేదు.. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలందర్నీ కలిశాను’ అని ఆయన అన్నారు. జగన్ దగ్గరికి వెళితే ఒక రకమైన అనుమానం, వెళ్లకపోతే మరోరకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తనను కొందరు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఆగస్టులో తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే రోడ్డెక్కేందుకు సిద్ధం అని మరోసారి తెలిపారు.