: బాల్య మిత్రుడి కోసం కాన్వాయ్ నే ఆపేసిన చంద్రబాబు
వయసు పెరుగుతున్న కొద్దీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... పాత జ్ఞాపకాలను, చిన్ననాటి సంగతులను నెమరువేసుకోవడం క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ తన కాన్వాయ్ ని చంద్రబాబు ఆపిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మొన్నామధ్య హైదరాబాదులోని తన ఇంటి నుంచి శంషాబాదు ఎయిర్ పోర్టుకు బయలుదేరిన చంద్రబాబు... పార్టీ సీనియర్ కార్యకర్తను చూసి నడిరోడ్డుపై కాన్వాయ్ ని ఆపేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఉదయం తన సొంతూరు నారావారిపల్లె నుంచి మహానాడు వేడుకలో పాలుపంచుకునేందుకు తిరుపతికి బయలుదేరిన సందర్భంగా తన చిన్ననాటి మిత్రుడిని చూసి రోడ్డుపైనే తన కాన్వాయ్ ని ఆపేశారు. రోడ్డుకు ఓ పక్కగా నిలిచిన తన బాల్య స్నేహితుడు, టీడీపీ కార్యకర్త గిరిధర్ రెడ్డిని చూసిన చంద్రబాబు తన కారును ఆపి ఆయనను తన వద్దకు పిలిచారు. గిరిధర్ రెడ్డిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరారు.