: ఆశావహుల సంఖ్య పెరుగుతోంది!... రాజ్యసభ సీటు కోసం చంద్రబాబుతో టీజీ వెంకటేశ్ భేటీ


పార్లమెంటులో పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి. తనకు దక్కనున్న సింగిల్ సీటుకు ఇదివరకే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పార్టీలోని ఆశావహులకు చెక్ పెట్టేశారు. అయితే రేపు నామినేషన్ల గడువు ముగియనుండగా, ఇప్పటిదాకా టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించలేదు. నిన్నటిదాకా తిరుపతిలో జరిగిన పార్టీ వార్షిక వేడుక మహానాడులో బిజీబిజీగా ఉన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... నేటి ఉదయం అభ్యర్థుల ఖరారు కోసమంటూ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందుగానే కర్నూలు నుంచి విజయవాడకు వచ్చిన పార్టీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ చంద్రబాబును కలిశారు. రాజ్యసభకు తనను పంపాలని ఆయన అధినేతను కోరారు. రాజకీయవేత్తగానే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న టీజీవీ వాదనను సాంతం విన్న చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకుండానే పార్టీ నేతలతో భేటీకి వెళ్లిపోయారు. ఇక తమకూ అవకాశం కల్పించాలని మరింత మంది పార్టీ నేతలు చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేదాకా ఈ తరహా అభ్యర్థనలు చంద్రబాబు వద్దకు వెల్లువెత్తే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News