: ఢిల్లీలో సోనియా ఇంటిని ముట్టడించిన బీజేపీ!... వాటర్ కేనన్లను ప్రయోగించిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో అధికారంలోని బీజేపీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటిని ముట్టడించారు. ముందస్తు ప్రకటన లేకుండానే వందలాది మంది కార్యకర్తలు సోనియా ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. బాట్లా ఎన్ కౌంటర్ కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగారు. ఉన్నపళంగా వందలాది మంది నిరసనకారులు చొచ్చుకురావడంతో వారిని నిలువరించడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో పోలీసులు వాటర్ కేనన్లను రంగంలోకి దింపారు. బీజేపీ కార్యకర్తలపై వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు ఎట్టకేలకు వారిని సోనియా నివాసం సమీపంలోకి రాకుండా అడ్డుకోగలిగారు.