: మహానాడు ముగిసింది!... సగం పసుపు చొక్కాలు తెల్లగా మారిపోయాయి!


తిరుపతిలో మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగిన టీడీపీ వార్షిక వేడుకలో ఆ పార్టీ నేతలు పసుపు రంగు చొక్కాల్లో మెరిసిపోయారు. ఉత్సాహంగా పసుపు రంగు చొక్కాల్లో సమావేశాలకు వచ్చిన నేతలు సామాన్య కార్యకర్తల మాదిరిగా మహానాడు వేదికపై సందడి చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా అందరూ పసుపు రంగు చొక్కాల్లోనే దర్శనమిచ్చారు. ఈ సమావేశాలు నిన్న సాయంత్రం ముగిశాయి. నిన్న రాత్రికే విజయవాడ చేరుకున్న ముఖ్య నేతలంతా... నేటి ఉదయం చంద్రబాబు పిలుపు మేరకు ఆయన నివాసానికి వచ్చారు. రాజ్యసభ బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేసే నిమిత్తం కీలక నిర్ణయాలు తీసుకునే ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. వీరిలో చాలా మంది పసుపు రంగు చొక్కాల్లో కాకుండా తెలుపు రంగు చొక్కాల్లో వచ్చేశారు. నారా లోకేశ్ తో పాటు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, నిమ్మకాలయ చినరాజప్ప, నామా నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు తెలుగు రంగు చొక్కాల్లో ఈ సమావేశానికి వచ్చారు. ఇక పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు పసుపు రంగు చొక్కాల్లోనే ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ అధినేత హోదాలో ఈ భేటీకి నేతృత్వం వహించిన చంద్రబాబు కూడా నిన్నటిదాకా మహానాడు వేదికపై పసుపు రంగు చొక్కాలో కనిపించగా, నేటి భేటీలో మాత్రం తన ఎవర్ గ్రీన్ గోదుమ రంగు డ్రెస్సులోకి మారిపోయారు.

  • Loading...

More Telugu News