: ఒక సీటుకు ఓకే... అభ్యర్థిని సూచించండి!: బీజేపీకి టీడీపీ సమాచారం
రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో అధికార టీడీపీ మిత్రపక్షం బీజేపీకి ఒక సీటును ఇవ్వడానికి నిర్ణయించింది. వచ్చే నెల 11న జరగనున్న రాజ్యసభ ఎన్నిలకు సంబంధించి ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు సీట్లు అధికార టీడీపీకి, ఓ సీటు విపక్ష వైసీపీకి దక్కనున్నాయి. తనకు దక్కనున్న మూడు సీట్లలో ఓ సీటును బీజేపీకి కేటాయించాలని టీడీపీ తీర్మానించింది. ఈ మేరకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్లతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ‘మీకు ఓ సీటు ఇస్తాం. అభ్యర్థిని సూచించండి’ అంటూ బీజేపీకి టీడీపీ సమాచారం పంపింది. ఈ కీలక భేటీలో టీడీపీ సీనియర్లు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, కిమిడి కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.