: ‘కప్’ రైజర్స్ దే!... ‘క్యాప్’లు మాత్రం చెరిసగం!
ఐపీఎల్-9 సిరీస్ లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హైదరాబాదు సన్ రైజర్స్ జట్టు టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇక ఈ దఫా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు కప్ దక్కడం ఖాయమన్న విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి. సిరీస్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరచిన రాయల్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... జట్టుకు కప్ ను మాత్రం అందించలేకపోయారు. నిన్న రాత్రి రాయల్స్ సొంత వేదిక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో కోహ్లీ సేనకు ఝలక్కిచ్చిన రైజర్స్ జట్టు కప్ ను ఎగరేసుకుపోయింది. రైజర్స్ కెప్టెన్ వార్నర్ మెరుపులతో పాటు అతడి వ్యూహం హైదరాబాదీ జట్టుకు టైటిల్ ను సాధించిపెట్టింది. హైదరాబాదు టైటిల్ ను ఎగరేసుకుపోయినప్పటికీ.. సిరీస్ లో రెండు ‘క్యాప్’ లలో ఓ దానిని రాయల్స్ జట్టు చేజిక్కించుకుంది. టోర్నీలో ఆది నుంచి బ్యాటును ఝుళిపించి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాయల్స్ కెప్టెన్ కోహ్లీ ఒకే సిరీస్ లో మూడు సెంచరీలు నమోదు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్నటి మ్యాచ్ లోనూ అతడు రాణించి సిరీస్ లో అత్యధిక పరుగులు (973) సాధించిన అటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను అందుకున్నాడు. ఇక బౌలింగ్ లో సత్తా చాటిన రైజర్స్ జట్టు బౌలర్ భువనేశ్వర్ కుమార్... సిరీస్ లో అత్యధిక వికెట్లు (23) తీసి ‘పర్పుల్ క్యాప్’ను అందుకున్నాడు.