: ప్రధాని పదవి అందివచ్చింది!... లోకేశ్ వద్దన్నాడని వదిలేశా!: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య!
టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ వేదికగా ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మొన్న రాత్రి ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. మహానాడును కవర్ చేసేందుకు తిరుపతికి తరలివెళ్లిన స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు శనివారం రాత్రి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన 1990 దశకంలో జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. నాడు తనకు అందివచ్చిన ప్రధానమంత్రి పదవిని తన కొడుకు నారా లోకేశ్ వద్దనడంతో వదిలేశానని ఆయన చెప్పారు. ‘‘నాన్నా... ఆ పదవి తాత్కాలికమే’’ అంటూ లోకేశ్ చెప్పాడని, దీంతో తనను వరించి వచ్చిన ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశానని చంద్రబాబు చెప్పారు. ‘‘యునైటెడ్ ఫ్రంట్ కు అధికారం దక్కడంలో 1996లో మేం కీలక పాత్ర పోషించాం. ఈ క్రమంలో ప్రధాని పదవి చేపట్టాలంటూ పలువురు ప్రముఖ నేతలు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను విముఖత చూపా. అయితే జ్యోతిబసు తదితరులు మరోమారు నాకు పీఎం పోస్టును ఆఫర్ చేశారు. నాడు నా కుమారుడు తొమ్మిదో లేక పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసులోనే ప్రధాని పదవి చేపట్టవద్దంటూ లోకేశ్ నన్ను ఆపాడు. ప్రధాని పదవి తాత్కాలికమేనని లోకేశ్ హెచ్చరించాడు. దీంతో చేతికి అందిన ప్రధాని పదవిని వదిలేశా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వయంగా చెప్పిన ఈ ఆసక్తికర విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థ ప్రముఖంగా ప్రచురించింది.