: బెజవాడ రండి!... ‘జంపింగ్’లకు చంద్రబాబు ఆహ్వానం!


రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార టీడీపీ తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం రాజ్యసభకు జరగనున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు స్థానాలున్నాయి. వీటిలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు స్థానాలు దక్కనున్నాయి. ఇక విపక్ష వైసీపీకి ఓ సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ పార్టీకి దక్కనున్న ఆ ఒక్క సీటుకు కూడా గండి కొట్టేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగో స్థానానికి కూడా అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇప్పటికే పార్టీ నేతల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో వాటి దిశగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. నేటి సాయంత్రంలోగా దీనిపై ఆయన ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ టికెట్ పై విజయం సాధించి ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నుంచి ఓ సందేశం వెళ్లింది. ‘రేపు సాయంత్రంలోగా విజయవాడకు రండి’ అన్న నిన్నటి సదరు సందేశంతో ‘జంపింగ్’ ఎమ్మెల్యేలు నేటి సాయంత్రానికి విజయవాడ చేరుకోనున్నారు. వీరితో ప్రత్యేకంగా భేటీ కానున్న చంద్రబాబు రాజ్యసభ బరిలో నాలుగో అభ్యర్థిని దింపాలా? వద్దా? అన్న అంశంపై సమాలోచనలు చేస్తారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. ఇటీవలే విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన తాను రాజ్యసభ బరిలో నాలుగో స్థానానికి పోటీ చేస్తానని ప్రతిపాదించారు. వైసీపీలో తనకున్న పరిచయాలతో సులభంగానే విజయం సాధిస్తానని ఆయన చంద్రబాబుకు చెప్పారు. అయితే దీనిపై అప్పటికప్పుడే ఎలాంటి హామీ ఇవ్వని చంద్రబాబు... తిరుపతిలో నిన్న మహానాడు వేడుకలు ముగియగానే దీనిపై దృష్టి సారించారు. ‘జంపింగ్’ ఎమ్మెల్యేల వాదనను పరిశీలించిన తర్వాత వేమిరెడ్డి ప్రతిపాదనకు సంబంధించి నేటి సాయంత్రం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ‘జంపింగ్’ ఎమ్మెల్యేల విజయవాడ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News