: మోదీ ఫ్లైట్ కు 'బ్యాడ్ వెదర్' రెడ్ సిగ్నల్!... ఢిల్లీ బదులు జైపూర్ లో ల్యాండైన విమానం!
ప్రతికూల వాతావరణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానానికి రెడ్ సిగ్నల్ వేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో దిగాల్సిన సదరు విమానం జైపూర్ లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ ఘటన నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... రెండేళ్ల పాలన ముగించుకున్న సందర్భంగా మొన్న ప్రారంభమైన విజయోత్సవాల్లో భాగంగా నిన్న కర్ణాటకలోని దావణగెరెలో జరిగిన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సదరు విమానం ఢిల్లీలో ల్యాండ్ కావడం సాధ్యపడలేదు. దీంతో ఢిల్లీకి సమీపంలోని జైపూర్ కు దారి మళ్లిన సదరు విమానం అక్కడ క్షేమంగానే ల్యాండైంది. వాతావరణం అనుకూలించగానే జైపూర్ నుంచి ప్రధాని బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండు గంటల పాటు మోదీ అక్కడే వేచి ఉన్నారు. వాతావరణం కాస్తంత అనుకూలించడంతో దాదాపు 2 గంటల తర్వాత ఆయన విమానం ఢిల్లీ చేరింది.