: ‘రాయల్స్’ను పడగొట్టిన ‘రైజర్స్’!... ఐపీఎల్ విజేతగా వార్నర్ సేన!


ఐపీఎల్ లో హైదరాబాదు సన్ రైజర్స్ జట్టు సత్తా చాటింది. ప్రతికూల పరిస్థితుల్లో పోరాట పటిమ చూపిన ఆ జట్టు ఐపీఎల్ లో రెండోసారి విజేతగా నిలిచింది. సిరీస్ ప్రారంభంలో అంతగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజేతగా నిలిచింది. సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బోల్తా కొట్టించిన వార్నర్ సేన విజేతగా నిలిచింది. నిన్న రాత్రి ‘రాయల్స్’ జట్టు సొంత పిచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోహ్లీ సేనను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించింది. దీంతో ఐపీఎల్ లో విజేతగా నిలవాలన్న కోహ్లీ సేన కల కలగానే మిగిలిపోయింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫస్ట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కెప్టెన్ వ్యూహానికి పదును పెట్టిన రైజర్స్ బ్యాట్స్ మెన్... జట్టు స్కోరును 200 మార్కును దాటించారు. కెప్టెన్ గా తన బాధ్యతను గుర్తుంచుకున్న వార్నర్ ఓపెనింగ్ ను ఘనంగా చాటాడు. శిఖర్ ధావన్ తో కలిసి బ్యాటింగ్ ను ప్రారంభించిన అతడు 8 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 38 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. అయితే మరో ఎండ్ లో క్రీజులోకి వచ్చిన ధావన్ (28) పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రిక్స్(4) వెనువెంటనే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ (38) ఫరవాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. హుడా (3), నామన్ ఒజా(7)లతో పాటు సెమీస్ లో సత్తా చాటిన బిపుల్ శర్మ (5) కూడా నిరాశపరిచారు. అయితే యువరాజ్ సింగ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ కటింగ్ (39 నాటౌట్) ఓ రేజింలో విరుచుకుపడ్డాడు. దీంతో చివరి మూడు ఓవర్లలోనే రైజర్స్ జట్టు 50 పరుగులు పిండుకుంది. వెరసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి వార్నర్ సేన 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆ తర్వాత 209 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన తొలుత బ్యాట్లు ఝుళిపించినా... చివరలో తడబడింది. విండీస్ సంచలనం క్రిస్ గేల్ తో రాయల్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు శుభారంభాన్నే ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాటును ఝుళిపించిన గేల్ వీర విహారం చేశాడు. బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన గేల్... 8 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 79 పరుగులు రాబట్టాడు. గేల్ ఆడుతున్నంతవరకు నెమ్మదించిన కోహ్లీ... అతడు ఔట్ కాగానే చెలరేగిపోయాడు. 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. వీరిద్దరి వీరవిహారంతో రాయల్స్ జట్టు తొలి 10.2 ఓవర్లలోనే 114 పరుగులు చేసింది. ఈ క్రమంలో రాయల్స్ జట్టు గెలిచిపోయిందని అంతా అనుకున్నారు. రాయల్స్ జట్టు ఓపెనర్లు వీర విహారం చేసినా ఏమాత్రం అధైర్యపడని వార్నర్ వ్యూహాత్మకంగా బౌలర్లను ప్రయోగించి వరుసగా వికెట్లు పడగొట్టాడు. రైజర్స్ బౌలర్ల బంతులకు చిత్తైన రాయల్స్ స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ (5), వాట్సన్ (11), కేఎల్ రాహుల్ (11) చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేలోగా 7 వికెెట్లు కోల్పోయిన రాయల్స్ జట్టు 200 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రైజర్స్ జట్టు 8 పరుగుల తేడాతో రాయల్స్ ను చిత్తు చేసింది. వాట్సన్ ఔటయ్యేదాకా రాయల్స్ జట్టే విజేత అన్న భావన కలిగింది. అయితే వాట్సన్ ఔట్ కాగానే ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన రైజర్స్ జట్టు బౌలర్లు కెప్టెన్ వ్యూహానికి మద్దతు పలికారు. వెరసి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నా... తనదైన శైలిలో వ్యూహాలు రచించిన వార్నర్... సన్ రైజర్స్ జట్టును రెండో పర్యాయం విజేతగా నిలిపాడు. ఇక బ్యాటింగ్ లోనే కాక వ్యూహ రచనలోనూ సత్తా చాటిన వార్నర్ కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News