: బాలీవుడ్ కే పరిమితం కాను, అందుకే మరాఠీ సినిమాలో కూడా నటిస్తున్నా!: హీరోయిన్ విద్యాబాలన్
‘ది డర్టీ పిక్చర్స్’ చిత్రం ద్వారా విమర్శలు, ప్రశంసలు పొందిన బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయట. సుమారు 8 నుంచి 10 చిత్రాల్లో నటించేందుకు తనకు ఆఫర్లు వచ్చాయని, అయితే, వాటిని నిరాకరించినట్లు ఆమె చెప్పింది. నిజజీవిత పాత్రలకు తాను కరెక్ట్ గా సరిపోతానని, నటనంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. కేవలం బాలీవుడ్ కే పరిమితం కానని, ముంబైలో తాను పుట్టి పెరిగాను కనుక మరాఠీ సినిమాల్లో కూడా నటించాలని కోరుకున్నానని, అందుకే ‘ఏక్ అల్బీలా’ మరాఠీ చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. మంచి పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటిస్తానని, మలయాళంలో ప్రస్తుతం ఒక చిత్రంలో నటిస్తున్నానని విద్యాబాలన్ చెప్పింది.