: మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికుల నరకయాతన!
మానస సరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు నరకయాతన పడుతున్నారు. చైనా-నేపాల్ సరిహద్దు హిల్సాలో గత నాలుగు రోజులుగా సరైన వసతి, ఆహారం లేకపోవడంతో మొత్తం 55 మంది తెలుగు యాత్రికులు నానా ఇబ్బంది పడుతున్నారు. నేపాల్ టూరిజం సంస్థ ద్వారా 15 రోజుల క్రితం మానస సరోవరం యాత్రకు తెలుగు యాత్రికులు వెళ్లారు. ఒక చిన్న గదిలో ఆరేడుగురు ప్రయాణికుల చొప్పున ఉంచారు. వాతావరణం అనుకూలంగా లేదని చెప్పి సదరు టూరిజం సంస్థ వారిని పట్టించుకోవడం లేదని బాధిత యాత్రికులు ఆరోపించారు. తెలుగు యాత్రికులలో 13 మంది మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మానస సరోవర యాత్రకు వచ్చిన యాత్రికులలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక యాత్రికుడు హిల్సాలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించాలంటే రూ.18 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్త మృతదేహాన్ని అక్కడే ఖననం చేసినట్లు సమాచారం.