: రేపు మోదీ కూడా నా వెనుకే ఉన్నారని టీడీపీ నేతలంటారు: ముద్రగడ పద్మనాభం
తెలుగుదేశం పార్టీ నేతలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాసరి నారాయణరావు, చిరంజీవి, రఘువీరారెడ్డి, సి.రామచంద్రయ్య, శైలజానాథ్, పళ్లంరాజు, బొత్సను తాను కలిశానని, కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరానని అన్నారు. తమ ఉద్యమానికి నేతల మద్దతు కోరుతుంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారనడం సరికాదని అన్నారు. ‘మొన్న జగన్, నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు నా వెనుక ఉన్నారని చెబుతున్న టీడీపీ నేతలు రేపు మోదీ కూడా నా వెనుకే ఉన్నారని అంటారు’ అని వ్యంగ్యంగా అన్నారు. ఆగస్టులోగా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ముద్రగడ హెచ్చరించారు.