: భారీ వర్షాలతో కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలం
గడచిన 24 గంటలుగా రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు కడప, అనంతపురం జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరగా, రహదారులపై మూడు నుంచి ఐదడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలోని 34 మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. సింహాద్రిపురంలో 74, కొండాపురంలో 47 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. రాయచోటిలో 30, వేములలో 29, రైల్వే కోడూరులో 25 మి.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని పలు వాగులు, వంకలు భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురంలో అత్యధికంగా 100 మి.మీ వర్షం కురవగా, బుక్కరాయసముద్రంలో 96, గుంతకల్లులో 90 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రజలకు సాయపడేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.