: ప్రతిపక్ష నేత దొంగబ్బాయ్ గారున్నారే...: లోకేష్ ఎద్దేవా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను నారా లోకేష్ 'దొంగబ్బాయ్' గా అభివర్ణించారు. మహానాడులో భాగంగా ఆయన ప్రసంగిస్తూ, "ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిపక్ష నేత దొంగబ్బాయ్ గారున్నారు. ఆయన పదేపదే మన మ్యానిఫెస్టో చూపిస్తారు. చూపించి, మనమిచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదంటారు. ఈ సభా ముఖంగా దొంగబ్బాయ్ గారిని ఒకటే అడుగుతున్నాను. అయ్యా! 25 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా? కాదా? అని అడుగుతున్నాను. అదే విధంగా పది వేల కోట్లు ఖర్చు పెట్టి డ్వాక్రా మహిళలకు చేయూతగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అవునా? కాదా? అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో 24 గంటల కరెంటు ఇచ్చింది కూడా మనమే. ఇది జగన్ మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. మూడు నెలల్లో ఎక్కడా చూడని విధంగా ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లను వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే" అని అన్నారు. "ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట కాదు... దాదాపు మూడు రోజులు పడుతుంది మన నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాలంటే. సంక్షేమమే కాదు, అభివృద్ధి చేయాలని కూడా లక్ష్యంగా మన నాయకుడు నిర్దేశించుకున్నారు" అని లోకేష్ వివరించారు. ఆరు నెలల పాటు అమరావతికి వచ్చినప్పుడెల్లా చంద్రబాబు బస్సులోనే తిని, బస్సులోనే పడుకుని, బస్సులోనే నిద్రించారని గుర్తు చేశారు.