: ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి... గంగోత్రి, కేదార్ నాథ్ రహదారికి అడ్డంకి... తెలుగువారి నరకయాతన
పవిత్ర చార్ ధామ్ యాత్రకు వెళ్లిన వారు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తేహ్రీ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, యాత్రికులు తమ గమ్యం సాగక మరింతగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గంగోత్రి నుంచి కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలు ఆగిపోయాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో, 50కి పైగా గృహాలు ధ్వంసమైనాయని, పశు సంపదకూ తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కోతియారా, కేమ్రా, సిలియారా ప్రాంతాల్లో వర్ష ప్రభావం అత్యధికంగా ఉందని వివరించారు. యమునోత్రికి వెళ్లే రహదారితో పాటు ఘన్ సాలీ - చామియాల మధ్య రహదారి కూడా మూసుకుపోయిందని, అవాంతరాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాఖండ్ వెళ్లిన తెలుగు యాత్రికులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి నరకయాతన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వర్షాలు మరింతగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.