: భార్యను జూదంలో ఓడిన అభినవ ధర్మరాజు!
మహాభారతంలో తన సర్వస్వాన్నీ జూదంలో ఓడిన ధర్మరాజు చివరికి తన తమ్ముళ్లనూ, భార్య ద్రౌపతిని సైతం పణంగా పెట్టి పాచికలాటలో ఓడిన సంగతి అందరికీ తెలిసిందే. కలియుగంలోనూ భార్యలను పందానికి పెట్టిన ఘటనలు గతంలో కొన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా, ఐపీఎల్ పోటీల్లో భాగంగా జరిగిన బెట్టింగులో యూపీలోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను పణంగా పెట్టి ఓడిపోయాడు. ఆపై గెలిచిన జూదరులు ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ఆమెను తమతో వచ్చి కోరిక తీర్చాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో దిక్కు తోచని ఆమె, స్థానిక సామాజిక కార్యకర్తల సాయం తీసుకుని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. నిందితుడు స్టాక్ మార్కెట్లో ఆస్తిని పోగొట్టుకున్నాడని, భార్యను అదనపు కట్నం కోసం వేధించే వాడని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ పోటీల్లో మ్యాచ్ గెలుపోటములపై పందాలు కాసే వాడని, డబ్బు లేక భార్యను బెట్ చేశాడని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.