: తెలంగాణలో నిలిచిపోనున్న పెట్రోల్, డీజిల్ సరఫరా!
తమ నుంచి వసూలు చేస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్నును తొలగించాలని డిమాండ్ చేస్తూ, పెట్రోలు, డీజిల్ ట్యాంకర్ల యాజమాన్యాలు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించనుండటంతో తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. సమ్మె కారణంగా 3,500 ఆయిల్ ట్యాంకర్లు షెడ్డులకే పరిమితం కానున్నాయి. ట్యాంకర్లు ఆగిపోతే, రద్దీగా ఉండే పెట్రోలు బంకుల్లో ఒకటి, రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్ లు నిండుకునే పరిస్థితి నెలకొంది. ట్యాంకర్ల యజమానుల సమ్మె ప్రారంభమైందని తెలుసుకుంటున్న బైకులు, కార్ల యజమానులు, ముందస్తుగానే పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ట్యాంకర్ల సమ్మెను వాయిదా వేయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం.