: నీరు ఎక్కువగా తాగడం కూడా ముప్పే?
ఏదయినా మోతాదు మించితే ప్రమాదమే అన్న రీతిలో... మంచినీరు కూడా మోతాదుకి మించి తాగితే అది పెను ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవుని శరీరంలోని రక్తనాళాల్లో బారో రెసెప్టర్స్, ఆస్మో రెసెప్టర్స్ అనే రెండు రకాల గ్రాహకాలు ఉంటాయి. ఇవి రెండూ రక్తంలో ద్రవపరిమాణం, ద్రవ గాఢతను పర్యవేక్షిస్తుంటాయి. ఈ రెండింట్లో ఏది తగ్గినా మెదడుకు సంకేతాలు అందిస్తాయి. అప్పుడే మనకు దాహం కలుగుతుంది. మామూలుగా శరీరంలో 60 శాతం నీరుంటుంది. స్త్రీలో 55 శాతం నీరుంటుంది. చిన్నిపిల్లల్లో దీని శాతం ఇంకాస్త ఎక్కువ. అవసరానికి మించి నీరు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా నీరు తీసుకోవడాన్ని ఓవర్ హైడ్రేషన్ అంటారని వారు చెబుతున్నారు. 75 కేజీల బరువున్న వ్యక్తి తక్కువ వ్యవధిలో 6 లీటర్ల నీటిని తీసుకుంటే అతని ప్రాణానికే ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్ సమతౌల్యత దెబ్బతిని బ్రెయిన్ ఫంక్షన్స్ ఆగిపోతాయని, తద్వారా మనిషి ప్రాణానికే ప్రమాదమని వారు తెలిపారు. యూకేలో ప్రభుత్వం సరఫరా చేసే కుళాయి నీళ్లు ప్రపంచంలోనే పరిశుభ్రమైన నీళ్లని నివేదికలు చెబుతున్నాయి. ఇతర పదార్థాల ద్వారా వచ్చే మినరల్స్ కంటే నీటి ద్వారా వచ్చే మినరల్స్ ను శరీరం తొందరగా గ్రహిస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కావడంలో శరీరంలోని నీటిదే ప్రథమ పాత్ర. చెమట ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను సమన్వయపరిచే నీరు, మలినాలను కూడా చెమటద్వారా బయటకు పంపేయడం విశేషం. నీటిద్వారా ఇన్ని ప్రయోజనాలున్నా... మోతాదు మించితే మాత్రం ప్రమాదమన్న సంగతి మరువకూడదు.