: అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతున్న ఉత్తర కొరియా నియంత పిన్ని!
ప్రస్తుత నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ పిన్ని (అమ్మ సోదరి) అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతోంది. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు (ప్రస్తుత అధ్యక్షుడి తండ్రి) కిమ్ జోంగ్ 2 భార్యల్లో ఒకరైన కో యంగ్ హుకు...కో యంగ్ సుక్ అనే సోదరి ఉంది. ఆమె తన భర్త రి గంగ్, ముగ్గురు పిల్లలతో కలసి అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతోంది. సాక్షాత్తూ అధ్యక్షుడి పిన్ని అయిన ఆమె కుటుంబపోషణ కోసం డ్రై క్లీనింగ్ వ్యాపారం చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈమె పిల్లలు, ప్రస్తుత అధ్యక్షుడు కలిసే పెరిగారని ఆమె చెప్పారు. కిమ్ జొంగ్ ఉన్ 1983లో జన్మించలేదని, 1984లో పుట్టాడని ఆమె తెలిపారు. 2011లో తండ్రి నుంచి అధికారం స్వీకరించేనాటికి కిమ్ జొంగ్ ఉన్ వయసు 27 ఏళ్లని ఆమె చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్ కు చిన్నప్పుడు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టమని, ఆ బాల్ ను పక్కన పెట్టుకుని నిద్రపోయేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడవుతాడని కిమ్ జొంగ్ ఉన్ కు 8వ ఏటే తెలుసని ఆమె చెప్పారు. చిన్నప్పటి నుంచి కిమ్ జోంగ్ ఉన్ కు కోపం ఎక్కువ, సహనం తక్కువని ఆమె తెలిపారు. అయితే ఉత్తరకొరియా నుంచి తాను కుటుంబంతో సహా అమెరికాకు ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. అమెరికాలో ఆమె ఇల్లుకొనుక్కుని స్థిరపడగా, ఆమె పిల్లలు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు.