: తాను 'బిగ్ బీ'ని కాదంటూ నిరూపించిన అమితాబ్... బీజేపీ విజయోత్సవంలో సరదా సంఘటన!
బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా భేటీ బచావో, భేటీ పఢావో కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ ను ఓ బాలిక ప్రశ్నిస్తూ...'సర్, మీరు బాల్యాన్ని ఎలా గడిపారు? ఇంత పెద్ద అమితాబ్ ఎలా అయ్యారు? గ్రేట్ బిగ్ బీగా ఎలా మారారు?' అంటూ ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పిన అమితాబ్...'నేను బిగ్ బీ అని ఎవరు అన్నార'ని అడిగారు. 'అంతా అంటున్నారు కదా సర్' అని బాలిక అనగానే... 'ఇలా రా' అని పిలిచిన అమితాబ్... కింద కూర్చుని 'ఇప్పుడు చూడు...నువ్వు బిగ్ బీ అన్నావు. నేనేమో నీకంటే చిన్నవాడిని చూడు' అన్నారు. దీంతో ఆ బాలిక సహా అంతా నవ్వేశారు. ఇక్కడ 'చిన్నా పెద్దా అనే తేడాలేవీ లేవని' అన్నారు. 'చిన్న అయినా, పెద్ద అయినా మన వయసులో మనం చేయాల్సిన పనిని చేయడమే'నని చెప్పారు. 'కష్టపడు, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు, విజయం దానంతట అదే వస్తుంద'ని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆ బాలిక తమ స్కూల్ కు రావాలని ఆహ్వానించింది. తమకు స్పూర్తి కలుగుతుందని చెప్పింది. 'స్పూర్తి మీకు కాదు తనకు కలుగుతుందని, తాను నేర్చుకునేందుకు దొరుకుతుంద'ని అమితాబ్ నవ్వుతూ చెప్పారు.