: ఈ ఐపీఎల్ ప్రత్యేకం... నయా ఛాంపియన్ కు స్వాగతం!


ఐపీఎల్ ఫైనల్స్ కు బెంగళూరు చిన్న స్వామి స్టేడియం సిద్ధమైంది. గత రెండు రోజులుగా బెంగళూరులో ఉన్న 'రాయల్ ఛాలెంజర్స్' జట్టు వ్యూహరచనలో నిమగ్నమైంది. 9 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న టైటిల్ ను అందుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ కు బంగారంలాంటి అవకాశం వచ్చింది. దీనిని వదులుకునేందుకు కోహ్లీ సేన ఏమాత్రం సిద్ధంగా లేదు. ఎలాగైనా కప్పు గెలుచుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తోంది. మరోవైపు 2012లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఖాతాలో కూడా టైటిల్ చేరలేదు. గత అన్ని సీజన్లలోనూ పేలవమైన ప్రదర్శనతో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఈ సారి బాగానే రైజైంది. ఓటములతో టోర్నీని ప్రారంభించి, బౌలర్ల ప్రతిభతో నిలదొక్కుకుని విజయాలు సాధించి, మళ్లీ పరాజయాల బాటపట్టి కష్టం మీద క్వార్టర్ ఫైనల్ కు చేరి, అక్కడి నుంచి సెమీ ఫైనల్, ఆ తరువాత ఎలిమినేటర్ మ్యాచ్ లలో విజయం సాధించి, టైటిల్ రేసులో నిలిచింది. దీంతో తమ జట్టును తక్కువ అంచనా వేయవద్దన్న సంకేతాలను పంపింది. అయితే బ్యాటింగ్ పరంగా చూస్తే కోహ్లీ సేన అభేద్యమైనది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, గేల్ రాణిస్తే స్కోరు బోర్డును ఎలా పరుగులు పెట్టించాలో కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్ చూసుకుంటారు. వీరంతా మూకుమ్మడిగా ఫెయిలైన ఒక్క మ్యాచ్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో బ్యాటింగ్ లో కోహ్లీ సేన దుర్భేద్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. సూపర్ స్టార్లు అనే కంటే సమయోచితంగా రాణించే బౌలర్లు సన్ రైజర్స్ సొంతం. వీరంతా ఆకట్టుకుంటుండబట్టే వార్నర్ విజయపరంపర కొనసాగిస్తున్నాడు. ఇక రాయల్స్ బౌలింగ్ బలహీనం... వాట్సన్, చాహల్ తప్ప మిగిలిన ఆటగాళ్లెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. క్వార్టర్ ఫైనల్, సెమీ పైనల్లో ఆ జట్టు బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. దానికి తోడు బ్యాట్స్ మన్ భారీ స్కోర్లు చేయడంతో ఆ జట్టు ఫైనల్ కు చేరింది. మరోవైపు సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగం బలమైనదే. అయితే పాకిస్ధాన్ జట్టులాంటి ఆర్డర్ తో ఎప్పుడెలా ఆడుతారే వారికే తెలియని స్థితిలో వారున్నారు. ఓపెనర్లు ధావన్, వార్నర్ రాణిస్తే ఎలాంటి జట్టుకైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆ తరువాత యువరాజ్ సింగ్ మ్యాచ్ ను ఏ క్షణంలో అయినా మలుపుతిప్పగల సామర్థ్యమున్న ఆటగాడు. దీంతో సన్ రైజర్స్ పూర్తి స్థాయి సామర్థ్యం ప్రదర్శిస్తే తప్ప టైటిల్ అందుకోవడం కష్టం. అయితే క్రికెట్ లో అసాధ్యం అంటూ ఏదీ లేదు కాబట్టి, ఆ ఫ్యాక్టర్ రెండు జట్ల ఆటగాళ్లకు కలిసివచ్చే అంశం. రెండు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే...ఈ ఫైనల్ మ్యాచ్ నయా ఛాంపియన్ ను ఐపీఎల్ కు పరిచయం చేస్తుంది.

  • Loading...

More Telugu News