: సాధించింది ఏమీ లేదు.. ఉత్సవాలు మాత్రం చేసేసుకుంటున్నారు: బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు
దేశ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం జరుపనున్న ఉత్సవాల పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. రెండేళ్లయినా ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ సాధించలేదని, అయినా ఉత్సవాలు జరుపుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఏం చేసిందో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక రంగాన్ని అదుపులో పెట్టడంలో బీజేపీ విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ, కరవు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు వంటి పరిస్థితులను తగ్గించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.