: యువతను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాం.. భజరంగ్ దళ్ శిక్షణ వివాదంపై ప్రవీణ్ తొగాడియా
ఆరోగ్య భారతావనిని తయారు చేస్తున్నందుకు భజరంగ్ దళ్‌కి సమాజ్ వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ వాద్ పార్టీ, బీజేపీ కృతజ్ఞతలు చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఇటీవల భజరంగ్ దళ్ ఆయుధాలతో నిర్వహించిన శిక్షణ శిబిరంపై వివాదం చెలరేగుతోన్న నేపథ్యంలో ఈరోజు ఆయన ఢిల్లీలో స్పందిస్తూ.. భజరంగ్ దళ్ 25 ఏళ్లుగా ‘యువ శౌర్య ప్రశిక్షణ్’ శిబిరాలు నిర్వహిస్తూ దేశ యువతను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతోందన్నారు. అది సామాజిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిరోజు వ్యాయామం చేసే అలవాటు లేకపోవడం వల్లే దేశంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన అన్నారు. శిక్షణ శిబిరాల ద్వారా యువత వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తున్నామని, దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు.