: వచ్చే ఏడాది ఏ అంశాన్ని లేవనెత్తాలనుకుంటున్నారో చెప్పేసిన సుబ్రహ్మణ్య స్వామి
ఏదో ఒక సమస్యపై పలు అంశాలను లేవనెత్తుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వచ్చే ఏడాది తాను ఏ అంశాన్ని లేవనెత్తాలనుకుంటున్నారో చెప్పేశారు. ఢిల్లీలో భారతీయ కిసాన్ అభియాన్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఏడాది వ్యవసాయ రంగంలోని సమస్యలపై పలు అంశాలను లేవనెత్తుతానని అన్నారు. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించిన అంశం తన ముందు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు భాగస్వాములుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని కూడా బట్టబయలు చేసే పనిలో ఉన్నానని, ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం తాను లేవనెత్తే అంశం వ్యవసాయ రంగంపైనే ఉంటుందని పేర్కొన్నారు.