: దాసరి నోట ముద్రగడ మాట!... కాపులకు రిజర్వేషన్లివ్వాల్సిందేనని డిమాండ్!


ఏపీలో కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రోడ్డెక్కిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి నానాటికి మద్దతు పెరుగుతోంది. నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న ముద్రగడ... నేటి ఉదయం నగరంలోని పలువురు కీలక నేతలతో వరుసగా భేటీ నిర్వహించారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలను కలిసిన ముద్రగడ... కొద్దిసేపటి క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని గడచిన ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని దాసరి వద్ద ముద్రగడ ప్రస్తావించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి... ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని దాసరి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాపుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News