: మరోమారు సుప్రీంకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా!... హైకోర్టు నిర్ణయాన్ని విభేదిస్తూ పిటిషన్
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో పాటు సభా నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. ఈ సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునేందుకు ఆమె నానా పాట్లు పడ్దారు. తొలుత తెలుగు రాష్ట్రాల హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులను ఆశ్రయించిన ఆమెకు ఎక్కడా ఊరట లభించలేదు. తాజాగా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి నోటీసులు అందుకున్న రోజా... సదరు పిటిషన్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కూడా విచారణకు స్వీకరించిన హైకోర్టు... రెండు పిటిషన్లపై వాదనలను ఒకేసారి వింటామని ప్రకటించింది. అయితే రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వినడం చట్ట విరుద్ధమంటూ రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని విభేదిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు పిటిషన్లను వేర్వేరుగా వినేలా హైకోర్టుకు ఆదేశాలివ్వాలని ఆమె ఆ పిటిషన్ లో సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... వచ్చే నెలాఖరులో దానిపై విచారణ చేపట్టనుంది.