: వీహెచ్ ఆశలు అడియాశలే!... రాజ్యసభ ఎన్నికల పోటీకి టీ కాంగ్రెస్ నిరాకరణ!


మరోమారు రాజ్యసభకు వెళ్లాలన్న టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు యత్నాలు బెడిసికొట్టాయి. వచ్చే నెలాఖరులో వీహెచ్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. వీహెచ్ తో పాటు దాదాపు 50 మందికి పైగా రాజ్యసభ సభ్యులు మాజీలు కానున్నారు. ఈ క్రమంలో ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ కోటాలో రెండు, ఏపీ కోటాలో నాలుగు సీట్లు కూడా ఉన్నాయి. అయితే సంఖ్యా బలంగా చూస్తే... తెలంగాణ కోటాలోని రెండు సీట్లు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. వీటికి ఆ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే మరోమారు రాజ్యసభకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్న వీహెచ్ తనదైన శైలిలో చక్రం తిప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన ఆయన అధిష్ఠానం నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిలతో భేటీ అయిన ఆయన తాను మరోమారు రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రతిపాదించారు. సరిపడినంత మంది ఎమ్మెల్యేల బలం లేకుండా పోటీ ఎలా చేస్తారన్న ప్రశ్నకు... అవసరమైతే తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు కోరతానని ఆయన వితండ వాదన చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న తనకు మద్దతిచ్చేందుకు కేసీఆర్ అంతగా వ్యతిరేకత ఏమీ చూపరని కూడా ఆయన వాదించారు. అయితే తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలించిన టీ పీసీసీ, టీ సీఎల్పీ రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయరాదన్న నిర్ణయానికి వచ్చాయి. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం టీ సీఎల్పీ అధికారికంగా ప్రకటించింది. దీంతో వీహెచ్ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

  • Loading...

More Telugu News