: ఎన్టీఆర్ పాత్రల్లో నటించలేదు... జీవించారు: చంద్రబాబు
‘ఉన్నతమైన ఆశయాల కోసం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఒక్క నందమూరే అని ఆయన అన్నారు. తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ఎంతగా గౌరవం సంపాదిస్తారో మళ్లీ అంతగా రాజకీయాల్లో సంపాదించే అవకాశం ఉండదు.. కానీ, ఆ ఘనతను ఎన్టీఆర్ సాధించార’ని అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమా పాత్రల్లో నటించలేదు, జీవించారు’ అని చంద్రబాబు అన్నారు. ఏ వేషమేసినా ఆ పాత్రకి న్యాయం చేశారని ఆయన అన్నారు. శ్రీ కృష్ణుడ్ని మన కళ్లకు చూపించారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో విభిన్నంగా కర్తవ్యం నిర్వహించారని చంద్రబాబు అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని మొట్టమొదటి సారిగా ఆయనే చెప్పారని వ్యాఖ్యానించారు. ‘పేదరికంలేని సమాజ నిర్మాణం చేయగలిగితే అదే మనం ఆయనకిచ్చే ఘన నివాళి’ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళితే అసాధ్యమయ్యే విషయం ఏమీ లేదని ఆయన అన్నారు. ‘అరవై ఏళ్లు నిండాక ఆయన రాజకీయాల్లోకొచ్చారు. అన్ని సంపాదనల్నీ వదులుకొని వచ్చారు. అవినీతి పట్ల చండశాసనుడిగా వ్యవహరించారు’ అని చంద్రబాబు అన్నారు.