: కోట్ల విలువైన సర్కారీ భూమిని వేలం వేయాలట!... టీడీపీలో కలకలం రేపుతున్న భూమా లేఖ!
విపక్ష వైసీపీ టికెట్ పై కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన భూమా నాగిరెడ్డి ఇటీవల తన సొంత గూడు టీడీపీకి చేరుకున్నారు. అప్పటిదాకా కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ఉన్న టీడీపీలో భూమా చేరిక పెను తుపానునే రేపింది. నంద్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబంతో తనకున్న వైరాన్ని భూమా మరింత ఎగదోశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ విభేదాలను ఇటీవలే కాస్తంత శాంతపరిచారు. ఆ వివాదం సద్దుమణిగిందో, లేదో... మరోమారు భూమా పార్టీలో కలకలం రేపారు. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖ అటు పార్టీలోనే కాకుండా ఇటు ప్రభుత్వంలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ లేఖలో ఏముందన్న విషయంపై ఆరా తీస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. నంద్యాల బస్టాండ్ కు ఎదురుగా రెండెకరాల ప్రభుత్వ స్థలం ఉంది. పట్టణం సెంటర్ లో ఉన్న స్థలంలో పశువైద్య శాలతో పాటు పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఉంది. అయితే సదరు కార్యాలయంతో పాటు పశువైద్యశాలను మరో చోటుకు తరలించి, ఆ భూమిని వేలం వేయాలని భూమా నాగిరెడ్డి ఆ లేఖలో చంద్రబాబుకు విన్నవించారు. సరిగ్గా బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమి విలువ ఎంతలేదన్నా రూ.10 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్ లో ఎకరా రూ.4 కోట్ల మేర ధర పలుకుతున్న ఈ భూమిని వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.10 కోట్లకు పైగా నిధులు సమకూరుతాయని, ఆ నిధులతో నంద్యాల మునిసిపాలిటిలో అభివృద్ధి పనులు చేపట్టాలని భూమా సూచించారు. పట్టణంలో ప్రభుత్వ ఆస్తిగా ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని వేలం వేయాల్సిన అవసరం ఏముందని ఓ వర్గం వాదిస్తుండగా, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని వేలం వేసి ఆ నిధులను పట్టణాభివృద్ధికి వినియోగిస్తే తప్పేంటని భూమా వర్గం వాదిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి!