: రూ.500 నోటిచ్చి టీడీపీ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకున్న చంద్రబాబు
టీడీపీలో తాను ఓ సామాన్య కార్యకర్తనేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న సవినయంగా ప్రకటించారు. తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో నిన్న ఉదయం ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సందర్భంగా చంద్రబాబు నోట ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగా వేడుక ప్రారంభానికి ముందే సభా ప్రాంగణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిర్ణీత సమయానికే వేడుక ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు... పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు చంద్రబాబు రాగానే అక్కడ నియమితుడైన ఓ కార్యకర్త చంద్రబాబుకు పార్టీ సభ్యత్వ కార్డును అందజేశాడు. సదరు కార్డును అపురూపంగా పరిగణించిన చంద్రబాబు దానిని తన మెడలో వేసుకుని సభ్యత్వ రెన్యూవల్ కోసం జేబులో నుంచి రూ.500 నోటును తీసి సదరు కార్యకర్తకు అందజేశారు.