: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన నాదల్
గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 200వ విజయం సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు నాదల్ పారిస్ లో మాట్లాడుతూ, మణికట్టు గాయంతో బాధపడుతున్నానని అన్నాడు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. టోర్నీలో కొనసాగేందుకు మణికట్టు గాయానికి తరచు ఇంజెక్షన్ తీసుకుంటున్నా ఎటువంటి ఫలితం ఉండడం లేదని, అందువల్ల టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చిందని చెప్పాడు. గాయాల బారిన పడటం ఆటగాళ్ల జీవితంలో ఒక భాగమని చెప్పిన నాదల్, వచ్చే ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాలుగో సీడ్ నాదల్ 6-3, 6-0, 6-3 తేడాతో ప్రపంచ 99వ ర్యాంకర్ ఫకుండో బాగ్నిస్ (అర్జెంటీనా)పై సులువుగా విజయం సాధించాడు.