: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మహిళపై అఘాయిత్యం
పంచాయతీ ఆఫీస్ లో మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన కర్ణాటకలో కలకలం రేపుతోంది. మాండ్య జిల్లాలోని కెస్టూరు పంచాయతీ ఆఫీసులో ఓ వివాహిత పని చేస్తోంది. భర్త లేకపోవడాన్ని అలుసుగా తీసుకున్న పంచాయతీ ప్రెసిడెంట్ చంద్రహాస్ పంచాయతీ ఆఫీసులోనే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ ఎంత ప్రతిఘటించినా, చేతులు జోడించి వేడుకున్నా ఆయన పట్టించుకోకపోవడం విశేషం. ఈ ఘటన అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జేడీఎస్ కు చెందిన చంద్రహాస్ అత్యాచార పర్వం మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అతని కీచకపర్వం వెలుగు చూసింది. ఇది మీడియాలో ప్రసారం కావడంతో కర్ణాటకలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఘటనలో నిందితుడు గతంలో చాలా మంది మహిళలపై అఘాయిత్యానికి తెగబడినట్టు తెలుస్తోంది.