: రెండు రికార్డులకు ఐదు పరుగుల దూరంలో అవుటైన కుక్
ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ రెండు రికార్డులకు ఐదు పరుగుల దూరంలో అవుటై నిరాశపరిచాడు. టెస్టుల్లో టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును చేరుకునేందుకు సరిగ్గా ఐదు పరుగుల దూరంలో అవుటయ్యాడు. శ్రీలంకతో టెస్టు ప్రారంభానికి ముందు 36 పరుగులు చేస్తే టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్ గానూ, సచిన్ తో పాటు పదివేల పరుగులు చేసిన మరో నలుగురు దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరి రికార్డు నెలకొల్పేవాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 15 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేసి, మరో ఐదు పరుగుల దూరంలో కుక్ నిలిచిపోవడంతో అతని అభిమానులు నిరాశచెందారు. పదివేల పరుగుల రికార్డు నెలకొల్పినప్పుడు సచిన్ వయసు 31 సంవత్సరాల 10 నెలలు కాగా, ప్రస్తుతం కుక్ వయసు 31 ఏళ్ల 4 నెలలు. తరువాతి టెస్టులో కుక్ ఈ ఫీట్ అందుకుంటాడని అభిమానులు సరిపుచ్చుకుంటున్నారు.