: పిల్లల ఫీజు రద్దు చేస్తారా?... లేక ఐఎస్ఐఎస్ తో దాడి చేయించమంటారా?
స్కూళ్లలో ఫీ'జులుం' కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. దేశవ్యాప్తంగా విద్య పెద్ద వ్యాపారమయిపోయింది. ఈ నేపథ్యంలో స్కూళ్ల ఆగడాలు భరించలేకపోయిన ఓ తండ్రి ప్రిన్సిపల్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో కలకలం రేగుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీసీఎం స్కూలులో ఉస్మాన్ తన ఇద్దరు పిల్లలను చేర్చాడు. అయితే పెద్ద మొత్తంలో ఫీజులు కట్టలేకపోయిన ఆయన తగ్గించాలని ప్రిన్సిపల్ వర్గీస్ జోసఫ్ ను కోరాడు. ఆయన ఫీజులు తగ్గించేందుకు అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ఉస్మాన్ అతనికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఫీజులు రద్దు చేయకపోతే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో స్కూలుపై దాడి చేయిస్తానని హెచ్చరించాడు. లేదంటే నిలువునా తగులబెట్టేస్తానని ఆయన హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిన ప్రిన్సిపాల్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు ఉస్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, కేవలం ప్రిన్సిపల్ ను బెదిరించేందుకే అలా లేఖ రాశానని, తనకు, ఐఎస్ఐఎస్ కు ఎలాంటి సంబంధం లేదని ఉస్మాన్ తెలిపాడు. ప్రిన్సిపల్ తో తనకు వ్యక్తిగత వైరం లేదని, త్వరలోనే ఫీజులు కట్టేస్తానని ఆయన తెలిపాడు.