: పరిటాల హత్య నుంచి తుని ఘటన దాకా... చంద్రన్న నోటి వెంట ఎన్నో అంశాలు!


ఈ ఉదయం ప్రారంభమైన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మహానాడు వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిటాల హత్య కేసు నుంచి తుని ఘటన వరకూ ఎన్నో అంశాలను ప్రస్తావించి, పలుమార్లు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ ల వైఖరిపై నిప్పులు చెరిగారు. పరిటాల హత్యకు ప్రణాళిక వేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని, వారే మొన్నటి తుని విధ్వంసానికీ కారణమని ఆరోపించారు. పరిటాల హత్యపై తాను అసెంబ్లీలోనే వైఎస్ ను నిలదీశానని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మేలు కలుగుతుందని నొక్కి చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించిన చంద్రబాబు, పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, సంక్రాంతి కానుకలతో పేదల ముఖాల్లో పండగ సంబరాల ఉత్సాహం మరింతగా పెరిగిందని అన్నారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ అభిమతమని, గృహ నిర్మాణాన్ని మరింత సులభం చేసేందుకే ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్నామని, భవిష్యత్తులో పెన్నా, కృష్ణల అనుసంధానాన్నీ చేసి చూపిస్తామని వివరించారు. రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని, అప్పుడే పార్టీ ముందంజ వేయడంతో పాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News