: ఫ్లిప్ కార్ట్ వదిలేసిన టెక్కీలకు పేటీఎం వల!


ఐఐఎం విద్యను అభ్యసించి, క్యాంపస్ ప్లేస్ మెంట్లలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని, ఆపై ఉద్యోగంలో చేరేందుకు అనుమతి లభించక వేచి చూస్తున్న టెక్కీలపై అతిపెద్ద మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం కన్నేసింది. ఇటీవల జరిగిన ప్లేస్ మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్న పేటీఎం, ఆహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని నేడు ప్రకటించింది. "మా వద్ద ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జాయినింగ్ తేదీ ఆలస్యం అవుతుందని భావించే వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము సిద్ధం. ఈ మేరకు అహ్మదాబాద్ ఐఐఎం అధికారులతో మాట్లాడుతున్నాం. విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగాము" అని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా వ్యాఖ్యానించారు. తమకు చేరిన విద్యార్థుల ప్రొఫైల్స్ లో జాయినింగ్ తేదీలు ఆలస్యమైన వారివి కూడా ఉన్నాయని, వీటిని పరిశీలించి నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అయితే, ఎంతమందికి అవకాశం ఇస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించని ఆయన, ఆ సంఖ్య రెండంకెల అంకేనని తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News