: వదిలేస్తే వెళ్లి బార్లలో డ్యాన్సులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటా!: ముంబై అధికారులకు యువతి వేడుకోలు


గత సంవత్సరం డిసెంబరులో ముంబై పోలీసులు రక్షించి తెచ్చిన ఓ బార్ డ్యాన్సర్, ఇప్పుడు తనను విడిచిపెడితే, తిరిగి బార్ కు వెళ్లి నృత్యాలు చేసుకుని ఇంటిని పోషించుకోవాల్సి వుందని అధికారులను వేడుకుంటోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మిరా రోడ్డులోని ఓ బార్ పై దాడులు చేసిన పోలీసులు, అలీషా (గోప్యత కోసం పేరు మార్చాం) అనే మైనర్ బాలిక సహా 34 మంది యువతులను గత సంవత్సరంలో అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పునరావాస కేంద్రంలో ఉంచారు. ఆమెకు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ, తాను మేజర్ నని, ఇక విడిచిపెడితే, ఇంటికెళ్లి తన వృత్తిని కొనసాగిస్తానని మహారాష్ట్ర శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఈ ఆరేడు నెలలుగా తన ఇల్లు గడవడం లేదని, తన సంపాదన ఎంతో ముఖ్యమని తెలిపింది. కాగా, అలీషా లేఖ రూపంలో పెట్టుకున్న దరఖాస్తు, ఇటీవల డ్యాన్స్ బార్లకు అనుమతి కేసు విచారిస్తున్న వేళ, సుప్రీంకోర్టు ముందుకు సైతం వచ్చింది. ఈ లేఖ చూసిన తరువాతనే "వీధుల్లో అడుక్కుతినడం కన్నా డ్యాన్సులు చేసుకోవడం ఉత్తమం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 7వ తరగతి వరకూ చదువుకున్న అలీషా, వెస్ట్రన్ డ్యాన్స్ లో నిష్ణాతురాలు. బార్ లో నృత్యాలు చేస్తున్న సమయంలో తనకొచ్చే పాకెట్ మనీతో, ఖరీదైన సెల్ ఫోన్, మంచి బట్టలు, స్నేహితులతో టూర్లు వంటివెన్నో అనుభవించింది. నాకొచ్చిన నృత్యాన్ని కస్టమర్ల ముందు ప్రదర్శించడంలో తప్పేమీ లేదు. ఓ కళాకారిణిగా ఆడియన్స్ ముందు ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తే అభ్యంతరమేంటి? అని అలీషా ప్రశ్నిస్తోంది. పునరావాస కేంద్రంలో తనకు నేర్పిన విద్యలు కనీసం తిండి పెట్టే సంపాదనను కూడా దగ్గర చేయలేవని మండిపడింది. కాగా, అలీషా తరఫు న్యాయవాది బ్రగాంజా ఈ లేఖపై మాట్లాడుతూ, ఆమెన్నడూ పడుపు వృత్తిని ఎంచుకోలేదని, కేవలం నృత్య కళాకారిణిగా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటోందని తెలిపారు. ఈ మేరకు జనవరిలో గైనకాలజీ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించామని, ఆమెను బార్లలో నాట్యం చేసేందుకు అనుమతించాలని కోర్టును కోరనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News