: ‘బాహుబలి’ కటౌట్ లో నారా లోకేశ్!... ‘శాతకర్ణి’ గెటప్ లో బాలయ్య!
టీడీపీ ఏటా నిర్వహించుకునే పండుగ ‘మహానాడు’ కొద్దిసేపటి క్రితం తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ వేడుక వద్ద పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ‘బాహుబలి’గా చూపుతూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ రంగు పసుపు కలర్ చొక్కాలో వచ్చిన లోకేశ్...‘బాహుబలి’ రూపంలో తనకు ఏర్పాటు చేసిన కటౌట్ ను ఆసక్తిగా తిలకించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే హోదాలో హాజరైన నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్టైల్లోనే వేడుకకు హాజరయ్యారు. భారీ మీసకట్టు, శాతకర్ణిని తలపించే హెయిర్ కట్ తో ఆయన తెలుపు రంగు దుస్తుల్లోనే అక్కడికి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.