: హిందూజాలకు ఎదురుదెబ్బ!... ఆయుధాల తయారీకి అనుమతి నిరాకరణ!
రక్షణ రంగంలోకి అడుగిడి భారీ లాభాలు ఆర్జిద్దామన్న హిందూజా సోదరులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారు చేస్తామన్న హిందూజా గ్రూప్ నకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మొన్నటిదాకా విభిన్న రంగాల్లో సత్తా చాటిన హిందూజా గ్రూప్... తన అనుబంధ కంపెనీ గల్ఫ్ ఆయిల్ కార్ప్ లిమిటెడ్ (జీఓసీఎల్) ద్వారా ఆయుధ తయారీ కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. గ్రనేడ్లు, డిటోనేటర్లు, ఇతర మందుగుండు సామగ్రిని తయారు చేసేందుకు అనుమతించాలని ఆ సంస్థ 2015 ఆగస్టులోనే దరఖాస్తు చేసుకుంది. జీఓసీఎల్ తో పాటు నాడు పలు ఇతర కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే పలు కంపెనీలకు అనుమతి ఇచ్చేసిన రక్షణ శాఖ... హిందూజాలకు చెందిన జీవోసీఎల్ కు మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఏ కారణం చేత హిందూజాలకు అనుమతి నిరాకరించారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.