: తమిళనాట ఆరిపోయిన కాంగ్రెస్ దీపం!... పార్లమెంటులో ఆ రాష్ట్రం నుంచి ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా లేరు!
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ దీపం తమిళనాడులో దాదాపుగా ఆరిపోతోంది. తొలిసారిగా ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ ఎంపీ కూడా పార్లమెంటు ఉభయసభల్లో లేని పరిస్థితి దాపురించింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం లాంటి సీనియర్ నేతలున్నా తమిళ తంబీలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. తాజాగా రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కే పరిస్థితి లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకుంది. అయితే ఆ పార్టీ మిత్రపక్షం డీఎంకే 89 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఈ బలంలో ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ రెండు సీట్లకు తన పార్టీ నేతలనే ప్రకటించిన డీఎంకే... కాంగ్రెస్ కు అవకాశం కల్పించలేదు. దీంతో అటు లోక్ సభలోనే కాకుండా ఇటు రాజ్యసభలోనూ తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సభ్యుడు లేకపోవడం ఇదే ప్రథమం.