: మీ ఎన్నిక... మా భాగ్యం!: వెంకయ్యపై కన్నడ కాంగ్రెస్ సీనియర్ ఆసక్తికర కామెంట్లు
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిజంగా ఆజాత శత్రువే. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు దాదాపుగా రాలేదనే చెప్పాలి. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నేతగా ఎదిగారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక కోటాలో ఇప్పటికే మూడు పర్యాయాలు ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. అంటే పార్లమెంటులో ఆయన కర్ణాకటకు చెందిన నేతగా 18 ఏళ్ల పాటు కొనసాగారు. తాజాగా మరోమారు కూడా ఆయన కర్ణాటక నుంచే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. వరుసగా నాలుగో టెర్మ్ రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేతగా అరుదైన రికార్డు సృష్టించనున్న వెంకయ్య... కర్ణాటక నేతగా ఏకంగా 24 ఏళ్ల పాటు కొనసాగినట్లవుతుంది. ఈ క్రమంలో ఆయన అభ్యర్థిత్వంపై కన్నడిగులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అదేదో బీజేపీ నేతలు వ్యక్తం చేస్తే పెద్దగా పట్టించుకోనక్కరలేదు కానీ, బీజేపీ బద్ధ విరోధ పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్షం వ్యక్తం చేస్తే చెప్పుకోవాల్సిందేగా. కాంగ్రెస్ పార్టీకి చెందిన కన్నడ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎంవీ రాజశేఖరన్... ఇటీవలే వెంకయ్యకు ఓ లేఖ రాశారు. అందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం కన్నడిగుల భాగ్యమని రాజశేఖరన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్య పాటుపడతారన్న నమ్మకం తనకుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉంటే ఆ పదవికి వెంకయ్య వన్నె తెచ్చారని కూడా రాజశేఖరన్ ఆ లేఖలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.