: ఏపీ మంత్రి బొజ్జల పీఎస్ఓకు టోకరా ఇచ్చిన మహిళ!... ఏడాదిన్నర తర్వాత అరెస్ట్


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంట ఏడాదిన్నర క్రితం చేతివాటం ప్రదర్శించిన మహిళను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ఉన్న బొజ్జల ఇంటిలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన వివరాల్లోకెళితే... 2014 డిసెంబర్ లో బొజ్జల ఇంటికి వచ్చిన ఓ మహిళ తనను తాను సుజాతారావుగా పరిచయం చేసుకుంది. తాను విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎల్ రావు కూతురునని చెప్పుకుంది. మంత్రిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పిన ఆమె బొజ్జల పీఎస్ఓ వాసుతో మాట కలిపింది. తనకు కాస్తంత డబ్బు అవసరం ఉందని చెప్పిన ఆమె వాసు నుంచి రూ.7 వేలు తీసుకుంది. ఇదే విషయాన్ని బొజ్జలకు చెప్పేందుకు వాసు ఇంటి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేలోగానే ఆమె అక్కడి నుంచి జారుకుంది. ఆమె వ్యవహార సరళిపై అనుమానం వచ్చిన వాసు ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పి.విజయలక్ష్మిగా గుర్తించారు. ఆమె ఆచూకీపై స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు మొన్న (బుధవారం) విజయవాడలో అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News