: టీడీపీ పండుగ ‘మహానాడు’కు సర్వం సిద్ధం!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఏటా నిర్వహించుకునే వార్షిక పండుగ ‘మహానాడు’కు సర్వం సిద్ధమైంది. తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకకు ఏర్పాట్లన్నీ నిన్న రాత్రికే పూర్తయ్యాయి. నేటి ఉదయం 10 గంటల సమయంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసంతో ఈ వేడుక ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఏకబిగిన జరగనున్న ఈ వేడుకలు ఆదివారం చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో పూర్తి కానున్నాయి. ఈ వేడుకలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 వేల మంది పార్టీ ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు. 15 ఏళ్ల తర్వాత తిరుపతి నగరం ఈ వేడుకలకు మరోమారు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి ‘మహానాడు’ కూడా ఇదే. మొత్తం 18 తీర్మానాలపై చర్చ జరగనున్న ఈ భేటీలో తెలంగాణలో పార్టీ స్థితిగతులు, టీఆర్ఎస్ పై ఎదురుదాడికి వ్యూహాలకూ పదును పెట్టనున్నారు. ఏపీకి కేంద్రం సాయంపైనా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. తొలి రోజు సమావేశాల్లో భాగంగా 7 తీర్మానాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు పార్టీకి చెందిన అగ్ర నేతలు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మొన్ననే తన సొంతూరు నారావారిపల్లె చేరుకున్నారు. నిన్న ఆయన పార్టీ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.

  • Loading...

More Telugu News