: ప్రధాని మోదీ తన తల్లితో దిగిన ఫొటోకు అత్యధిక ‘లైక్స్’
ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టుల్లో అత్యధిక లైక్స్ వచ్చింది ఆయన తల్లితో పోస్ట్ చేసిన ఫొటోకేనట. ఈ విషయాన్ని ‘ఫేస్ బుక్’ పేర్కొంది. ప్రధానిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం తమ ఎజెండాను ‘ఫేస్ బుక్’ ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లిందనే దానిని సదరు సంస్థ చేసిన విశ్లేషణను వెలువరించింది. గత ఏడాదిగా ఫేస్ బుక్ ను కేంద్ర మంత్రులు బాగానే ఉపయోగించుకున్నట్లు పేర్కొంది. 2014లో మే 26 నుంచి 2016 మే 23 వరకు ప్రధాన మంత్రి మోదీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో తల్లి హీరాబెన్ తో కలిసి దిగిన ఒక ఫొటోకు అత్యధికంగా 1.6 మిలియన్ల లైక్స్, 34,000 కామెంట్స్, 123,000 షేర్లు వచ్చాయి. రేస్ కోర్సు రోడ్ లోని తన అధికారిక నివాసంలో మోదీ తన తల్లితో కలిసి ఈ ఫొటో దిగారు. కాగా, ‘ఫేస్ బుక్’ మాధ్యమం ద్వారా ఇష్టపడే ప్రపంచ దేశాల నేతల్లో ప్రధాని మోదీకి రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.